17 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నం : కేఏ పాల్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. వరంగల్ నుంచి మాజీ మంత్రి బాబు మోహన్ పోటీలో ఉంటారని చెప్పారు. సోమవారం అమీర్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నట్టు ఇది వరకే చెప్పినట్టు పాల్ గుర్తుచేశారు. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారన్నారు.

తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదని, అందుకే ఇతర పార్టీల నుంచి చేరినవారికి టికెట్లు ఇచ్చారని పాల్ ఆరోపించారు. కాంగ్రెస్ లో ఏక్ నాథ్​ షిండేలను బీజేపీ తయారు చేసిందన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్​ను పాల్ నియమించారు. అందుకు బాబు మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. మొన్నటిదాకా బీజేపీలో ఉన్నానని, ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేస్తానని చెప్పారు. బీజేపీ నేతగా 12 రాష్ట్రాల్లో ప్రచారం చేశానని, బీజేపీ నేతలు తనను వాడుకుని వదిలేశారని బాబు మోహన్ ఆరోపించారు. వరంగల్ లో తనకు ఎంతో మంది అభిమానులు, శ్రేయోభిలాషులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.