కామారెడ్డి, వెలుగు: మాస్టర్‌ప్లాన్ బాధిత రైతులంతా ఏకమై కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు. కామారెడ్డి జిల్లా సదాశివ్‌నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు గురువారం సమావేశమయ్యారు. దీనికి పాల్హాజరై, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు 100 మంది కేసీఆర్‌పై పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని అభిప్రాయపడ్డారు.100 మంది కాకుండా బాధిత రైతుల్లో నుంచి ఒకరిని పోటీకి దింపాలని కోరారు.
పోటీ చేసే రైతు తరఫున తానే పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానన్నారు. బాధిత రైతులు 2 వేల మంది ఉంటారని, వీరి ఫ్యామిలీ ఓట్లు కలుపుకొని 8 వేల ఓట్లు ఉంటాయన్నారు. 8 వేల మంది తలా10 ఓట్లు వేయిస్తే 80 వేల ఓట్లు వస్తాయన్నారు. అయితే, తమ తరఫున పోటీ చేస్తే మద్దతు తెలుపుతామని రైతులు కేఏ పాల్‌తో చెప్పారు. రైతులంతా ఐక్యంగా ఉండి పోరాటంతో పాటు, ఎన్నికల్లో ప్రచారం చేస్తే పోటీపై ఆలోచిస్తాననని కేఏపాల్ సమాధానమిచ్చారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ 72 గంటల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ఆదివారం 2 వేల మంది రైతులతో మీటింగ్నిర్వహించి పోటీపై నిర్ణయం వెల్లడిస్తానన్నారు. రైతుల తరపున ఒకరు పోటీలో నిలిచి, గెలిస్తే ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందన్నారు. ఒకవేళ తనను నిలబెట్టి గెలిపిస్తే కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నిర్మించి దేశ, విదేశాల నుంచి డాక్టర్లను తీసుకువస్తానన్నారు. మండలానికి రెండు అంబులెన్సులతో పాటు, హాస్పిటల్‌కు హెలిక్యాప్టర్ సమకూరుస్తానన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్య కోసం స్కూల్, కాలేజీ నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాన్నారు. ఇవన్ని తన సొంత పైసలతో 3 నుంచి 6 నెలల్లో కంప్లీట్ చేస్తానన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు తనతో డిబేట్‌కు వస్తే ధరణిలో అవినీతి, ఇతర అక్రమాలను పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటేనన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోవని తాను వారికి అండగా నిలుస్తానన్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల పక్షాన తాను హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.