తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే కారణం.. కేఏ పాల్

బుధవారం ( జనవరి 8, 2025 ) తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి తొక్కిసలాట చంద్రబాబు వల్లే జరిగిందని.. ఆయన రాజీనామా చేసి నారా లోకేష్ ని సీఎం చేయాలని అన్నారు.

చంద్రబాబు తిరుపతిలో పెద్ద స్టంట్ చేశారని.. తాను సీఎం అన్న సంగతి మర్చిపోయి.. నెపాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది అనేలా వ్యవహరించారని అన్నారు.తిరుపతి దేవస్థానం రూ. 4 లక్షల కోట్ల ఆస్తి కలిగి ఉందని..  వాటికన్ తర్వాత వేల కోట్ల ఆదాయం వచ్చే ఆధ్యాత్మిక స్థలం తిరుపతి అని అన్నారు. ఇంత ఆదాయం వస్తున్నా భక్తులను కాపాడ్డంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు కేఏ పాల్. ఇది మొదటిసారి జరిగిన తప్పు కాదని.. 2019లో రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు నాయుడే ప్రత్యక్ష కారణమని అన్నారు.

ALSO READ | వైకుంఠ ఏకాదశి రోజు..తిరుమల వేంకటేశ్వరస్వామి10 మహిమలు తెలుసుకుందామా..!

రాజమండ్రి పుష్కరాలకు సినిమా షూటింగ్ ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి అమయాక ప్రజలను బలి తీసుకున్నారని అన్నారు. కందుకూరులో జరిగిన రాజకీయ సభలో తొక్కిసలాటకు కూడా చంద్రబాబే కారణమని అన్నారు. గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో కూడా ముగ్గురు చనిపోయారని..పాదయాత్ర పేరుతో తారకరత్న ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని అన్నారు.తిరుపతి ఆదాయాన్ని దోచుకోడానికి గజదొంగలు తయారయ్యారని,వేల కోట్ల ఆదాయం వచ్చే చోట సెక్యూరిటీకి ఒక కోటి ఖర్చు పెట్టలేరా అని ప్రశ్నించారు. 

744 మంది ఉన్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశం చేసినప్పుడు తిరుపతిని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతం చేయకూడదని ప్రశ్నించారు కేఏ పాల్. లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏం బాధ్యత తీసుకున్నారని అన్నారు.గతంలో రైల్వే ప్రమాదానికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయలేదా అని గుర్తు చేశారు కేఏ పాల్. విశాఖ సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులందరినీ అక్కడికి తరలించడం కారణంగా తిరుపతిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని అన్నారు. 

75 ఏళ్ల వయస్సులో ఇంకా సీఎంగా చంద్రబాబు ఉండాలా,నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండిన తర్వాత ప్రధాని పీఠం వదులుకోడానికి సిద్ధపడుతుంటే.. ఈయన ఈ వయస్సులో ఇంకా ఎందుకు సీఎంగా ఉన్నారుని ప్రశ్నించారు కేఏ పాల్. చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి యనమల రామకృష్ణుడు లేదా తన కొడుకు నారా లోకేశ్ ను సీఎం చేయాలని అన్నారు. బీసీ నేత యనమల రామకృష్ణుడు సీఎంగా ఉండేందుకు అర్హుడు, సమర్థుడని.. బీసీ కులంలో పుట్టినందుకే యనమల సీఎం కాలేకపోయారని అన్నారు కేఏ పాల్.