
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ తో రూ.12 లక్షల కోట్లను కేసీఆర్ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు.
చిత్తశుద్ధి ఉన్నవారంతా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కేఏ పాల్. 85 శాతం మంది ప్రజలు తననే కోరుకుంటున్నారని చెప్పారు. గద్దర్ కూడా చనిపోయేముందు బీఆర్ఎస్ భూస్థాపితం కావాలని, ప్రజాశాంతి పార్టీ గెలిపించాలని కోరారన్నారు. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంబేద్కర్, గద్దర్,అమరవీరుల ఆశయాలు నెరవేర్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకి మాత్రమే ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసే ఏడు స్థానాల్లో తప్ప మిగితా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 79 సీట్లలో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలనేది తన కోరిక అన్నారు. మైనంపల్లి తన కొడుకుతో కలిసి పార్టీలోకి వస్తే ఇద్దరిని గెలిపిస్తానని పాల్ తెలిపారు. ఇప్పటి వరకు తమ పార్టీకి 3వేల 900 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దేశమంతా కాంగ్రెస్ వాష్ అవుట్ అయిందన్న పాల్. కర్ణాటకలో కూడా తన మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని అన్నారు కేఏ పాల్. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేస్తానని చెప్పా..చేశానన్నారు. బ్రహ్మ దేవుడు దిగొచ్చిన ఇక చంద్రబాబు గెలవడన్నారు. అమరావతిలో రూ. 35 వేల ఎకరాలను చంద్రబాబు కబ్జా చేశాడని ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ లు మోడీ తొత్తులంటూ పాల్ తీవ్ర విమర్శలు చేశారు.