రైతు వేషంలో ఆకట్టుకున్న కేఏపాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రోజుకో గెటప్ లో చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు. మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన పాల్.. తాజాగా రైతు వేషంలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని.. రైతులతో కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ తన మాటలతో నవ్వించాడు. సమస్యలను అడిగి తెలుసుకుని తాను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. 

కేసీఆర్ కు ఓటు వేస్తే అభివృద్ది జరగదని కేఏ పాల్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు చేసేదేమి లేదన్నారు. ఓట్ల కోసం మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ధర్మం వైపే ఉంటారని కేఏ పాల్ అన్నారు. తన ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేసీఆరే స్వయంగా పోలీసులను పంపించి వాగ్వాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తనను ఎవరూ ఆపలేరని పాల్ చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.