కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేఏ పాల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ని కలిశారు. అనంతరం మాట్లాడుతూ... బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని, అప్పుల తెలంగాణ మాత్రమే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంత అవినీతి పాలనను ఇప్పటివరకు చూడలేదని, రూ.7 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. దళితులకు మూడెకరాలు, కుటుంబానికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయని, కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి అమెరికా నుంచి వచ్చానని పాల్ స్పష్టం చేశారు. తన శిష్యుడైన రాకేశ్ టికాయత్ ను అడ్డుపెట్టుకొని కొత్త రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కు ప్రత్యమ్నాయం లేదని, కానీ ఆయనను ఓడించేందుకు ప్రజా శాంతి పార్టీ ఆధ్యర్యంలో తెలంగాణ మొత్తం తిరుగతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు 30 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ కోసం తన వంతు పాత్ర పోషిస్తానని పాల్ చెప్పారు.