త్వరలోనే మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం

మునుగోడులో కేసీఆర్ను చిత్తుగా ఓడగొడతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. త్వరలోనే మునుగోడులో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. మునుగోడులో గెలిచిన ఆరునెలల్లో 50వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ఉచిత విద్య, అందిస్తామని తెలిపారు. ఒక వారంలో తమ చారిటీ తరపున 175 గ్రామాల్లో 175 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అవినీతిపాలనను అంతంచేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

అక్టోబర్ 2న హైదరాబాద్లో నిర్వహిస్తున్న గ్లోబల్ పీస్ మీటింగ్కు 28 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు వస్తారని కేఏ పాల్ తెలిపారు. ఈ మీటింగ్ పట్ల కేసీఆర్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను మీటింగ్కు ఆహ్వానిద్దామంటే.. అహంకారంతో ఆయన కలవడం లేదని ఆరోపించారు. పూర్తిగా నష్టపోయిన తెలంగాణను బాగుచేద్దామనే ఉద్ధేశ్యంతోనే ఈ మీటింగ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. 

48 గంటల్లోగా పీస్ మీటింగ్ పై కేసీఆర్ స్పందించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పోలీసులు కల్వకుంట్ల కుటుంబం చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా అక్టోబర్ 2న పీస్ మీటింగ్ జరుగుతుందన్నారు. ఈ మీటింగ్ వల్ల లక్ష కోట్లు లేదా లక్ష ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం కారని..భూస్థాపితం అవుతారని విమర్శించారు. గతంలో బీజేపీకి సపోర్ట్ చేసిన కేసీఆర్..ఇప్పుడు కేంద్రంపై యుద్ధం అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.