కేసీఆర్ను ప్రజలు ఛీకొడ్తున్నరు.. నన్ను అభిమానిస్తున్నరు : కేఏ పాల్

అధికారులంతా కేసీఆర్ తొత్తుల్లాగా పనిచేశారు

సీసీ కెమెరాల లింక్ మాకెందుకు ఇవ్వలేదు
డబ్బులు పంచిన విషయం అందరికీ తెలిసినా ఎలక్షన్ ఎందుకు రద్దు చేయలేదు

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో గోల్ మాల్ జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపణలు పునరుద్ఘాటించారు. ఓట్లకు డబ్బులు పంచారనే విషయం ఎన్నికల అధికారులతోపాటు అందరికీ తెలిసినా ఎలక్షన్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద  మీడియా సమావేశం నిర్వహించిన కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధికారులంతా కలిసి ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విమర్శించారు. 

అక్రమాల గురించి ముందే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారులు మొత్తం కేసీఆర్ కి తొత్తులుగా పనిచేశారని మండిపడ్డారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ కు వేసిన సీల్ మారిందని.. ఆరోపించిన కేఏ పాల్ సీసీ కెమెరా లు సంబంధించిన లింక్ మాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

‘‘ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదు..? టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో ఎందుకు వున్నారు ..? అని కేఏ పాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలింగ్  స్టేషన్ లో వృద్ధులతో రెండో నెంబర్ కు ఓటు వేయించారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఛీకొడ్తున్నారు.. నన్ను అభిమానిస్తున్నారు.. అని కేఏ పాల్ పేర్కొన్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూముల ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లు అప్పులు చేయడం.. అని కేఏ పాల్ ఆరోపించారు.