ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి.అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా విడుదల చేయటంతో ఇప్పడు ఎక్కడ చూసినా మేనిఫెస్టోల మీదనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రేసులో తానూ కూడా ఉన్నానంటూ మేనిఫెస్టోతో ముందుకొచ్చాడు కేఏ పాల్. ఈసారి విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశాడు. జగన్ నవరత్నాలకు పోటీగా దశరత్నాల పేరుతో కేఏ పాల్ మేనిఫెస్టో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
మేనిఫెస్టో పేరు మాత్రమే కాకుండా డిజైన్ విషయంలో కూడా వైసీపీనే ఫాలో అయ్యాడు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఈ పది గ్యారెంటీలు అమలు చేస్తామని తన మేనిఫెస్టో ప్రకటించారు కేఏ పాల్. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం, కేజీ టు పీజీ (ఇంగ్లీష్, తెలుగు మీడియం) ఉచిత విద్య, వితంతు మహిళకు నెలకు 5వేల రూపాయల పింఛన్, ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు నెలకు 6వేల రూపాయల నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, మత్స్యకార, రైతులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, నెలకు 25వేలకు తక్కువ లేకుండా జీతంతో 100రోజుల్లోనే ఉద్యోగ కల్పన వంటి హామీలు కేఏ పాల్ మేనిఫెస్టోలో కీలకంగా ఉన్నాయి.