మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కేఏ పాల్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల సందర్శనకు వచ్చారు. మునుగోడులోని ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాక ఆయన హడావుడిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. దీన్ని గమనించిన v6 ఆయనతో మాట్లాడింది. ఎందుకిలా ఉరుకులు పరుగులు పెడుతున్నరు అని ప్రశ్నించింది. దీంతో ఆయన ఆగి సమాధానమిచ్చారు. ‘‘నా తరఫున బూత్ ఇంచార్జిలు లేరు. ఒక్కడినే సాయంత్రం 6 గంటల్లోగా కనీసం 100 నుంచి 150 బూత్ లు తిరగాలి. అందుకే ఇలా రన్ చేస్తూ వెళ్తున్నాను.
పోలింగ్ సక్రమంగా సకాలంలో స్టార్ట్ అయింది. అది సజావుగా జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్లు ఓటుకు రూ.3వేలు, టీఆర్ఎస్ వాళ్లు ఇంటికి తులం బంగారం ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. ప్రజలే నాకు కార్యకర్తలు. ఓటర్లు మార్పు కోరుకుంటున్నరు. అభివృద్ధిని ఆశిస్తున్నరు. మీడియా వాళ్లను ఎవ్వరూ టచ్ చేయొద్దు. అలా చేసే వారెవరైనా నేను వదలను’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం కేఏ పాల్ వేగంగా పరుగెత్తి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.