తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ వాయిదా వేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అంబేద్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేశామని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గి సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని విమర్శించారు. మొత్తానికి కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కేసీఆర్ బర్త్ డే రోజున ప్రారంభించకుండా చేశామని పాల్ అన్నారు. సెక్రెటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సెప్టెంబర్ 17న జరగనున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.