మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయకపోతే దేశంలో ఎన్నికలు నిర్వహించడం వేస్ట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఒక నెలలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం ఖర్చయిందని ఆరోపించారు.
మునుగోడు ఉపఎన్నికను తక్షణం రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానని ఆయన తెలిపారు. ‘‘మునుగోడులో ఈవీఎంలను మార్చారు. ఈవీఎంలను భద్రపర్చిన గది సీల్ ను తొలగించారు’’ అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఉప ఎన్నిక అక్రమాలకు సంబంధించిన వీడియోలు , డాక్యుమెంట్లను సమర్పించానని కేఏ పాల్ వివరించారు.
కేఏ పాల్ కు 805 ఓట్లు..
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా మునుగోడు బై పోల్ లో పోటీ చేశారు. ప్రజా శాంతి పార్టీని ఈసీ ఇన్ యాక్టివ్ చేయడంతో కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పాల్ చుట్టేశారు. వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలతో మునుగోడు ప్రజలకు విద్యా, ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలో కేఏ పాల్ 805 ఓట్లు మాత్రమే సాధించగలిగారు.