పుష్ప స్థానంలో ఉంటే రూ.300 కోట్లు ఇచ్చేటోడ్ని : కేఏ పాల్

పుష్ప స్థానంలో ఉంటే రూ.300 కోట్లు ఇచ్చేటోడ్ని : కేఏ పాల్
  • రేవతి కుటుంబానికి రూ.25 కోట్ల డిమాండ్​ సబబే
  • రెండేండ్లలో జమిలి ఎన్నికలు ఖాయం

నిజామాబాద్, వెలుగు: హైదరాబాద్ సంధ్య థియేటర్​లో తొక్కిసలాటలో రేవతి మృతికి కారణమైన అల్లు అర్జున్​స్థానంలో తానుంటే రూ.300 కోట్లు ఇచ్చేవాడినని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్​అన్నారు. ఓ ఇల్లాలి చావుకు, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్​లో కొట్టుమిట్టాడడానికి పుష్ప ముమ్మాటికి కారకుడన్నారు. ఓయూ స్టూడెంట్స్​డిమాండ్​మేరకు బాధిత కుటుంబానికి రూ.25 కోట్ల పరిహారం చెల్లించాలని కోరారు. సోమవారం నిజామాబాద్​ లో  ఆయన మీడియాతో మాట్లాడారు. 

రేవంత్​రెడ్డి సీఎం కావడానికి తాను సాయం చేయగా.. తనను వాడుకొని వదిలేశాడని విమర్శించారు. నియంత సద్దాం హుస్సేన్​ను తలపించేలా తెలంగాణలో పాలన సాగుతోందని, ఇప్పటికి 422 ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. సినీ నటుడు నాగార్జున ఫంక్షన్​హాల్​ను నేలమట్టం చేయించి.. సీఎం తన తమ్ముడి ఇంటిని మాత్రం సేఫ్​గా పెట్టారన్నారు. రాష్ట్రంలో రేవంత్​ ట్యాక్స్​అమలవుతోందని ఆరోపించారు. మరో రెండేండ్లలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​పార్టీలు సర్పంచ్​లను అప్పులు పాలు చేశాయని ఆయన విమర్శించారు.  

వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపుతామన్నారు.  త్వరలోనే తాను విలేజ్​ టూర్​ ప్రోగ్రాంలు పెట్టుకున్నానని, ప్రతి జిల్లాలో కనీసం వంద పల్లెల్లో పర్యటిస్తానన్నారు. డిసెంబర్​30న నిజామాబాద్​​జిల్లాలో సర్పంచ్​పదవులకు పోటీ చేయనున్న ఆశావహులతో మీటింగ్​ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ తన పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.