గద్దర్‎ను హత్య చేశారు.. అన్ని ఆధారాలున్నాయ్: కేఏ పాల్

గద్దర్‎ను హత్య చేశారు.. అన్ని ఆధారాలున్నాయ్: కేఏ పాల్

నిర్మల్: ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీలో చేరిన గద్దర్‎ను కొందరు హత్య చేశారని.. గద్దర్ హత్యకు గురయ్యారనడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేఏ పాల్ సోమవారం (జనవరి 27) నిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు.  రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 13 నెలలైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. ప్రధాని మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి పాతాళంలోకి వెళ్లిపోయిందని విమర్శలు చేశారు. 

నిర్మల్‎ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన ఇక్కడ కనీసం మండల స్థాయి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలేవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సర్పంచ్‎లు అప్పుల పాలయ్యారని విమర్శించారు. అందుకే పాలన్న రావాలి.. పాలన మారాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో వంద రోజుల్లోనే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు కేఏ పాల్. అలాగే.. మా పార్టీ గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులందరికి ఉద్యోగం కల్పించి చూపిస్తామన్నారు. 

ALSO READ | రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. పేదలను మోదీ ప్రభుత్వం దోచుకుంటుంది

గద్దర్‎కు పద్మ పురస్కారం ఇవ్వకపోవడంపై వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‎కు పద్మ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను మోడీ సర్కార్ తోసిపుచ్చింది. గద్దర్‎కు పద్మ అవార్డు ఇచ్చేందుకు నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం. గద్దర్‎కు ప్రతిష్టాత్మక పద్మ పురస్కారం దక్కకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

పద్మ పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు. గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వకుండా యావత్ తెలంగాణ ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్నారు. ఈ తరుణంలో గద్దర్ మరణంపై కేఏ పాల్ చేసిన ‘మర్డర్’ వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‏గా మారాయి. గద్దర్ హత్యకు గురి అయ్యారనడానికి కేఏ పాల్ వద్ద ఉన్న సాక్ష్యాలేంటి అనే దానిపై చర్చలు మొదలయ్యాయి.