ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కరించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాత్రి నిద్రలోకి జారుకున్నాక ఆసుపత్రిలోకి సంచరించిన ఎలుకలు .. షేక్ ముజీబ్ కాళ్లు, చేతులను కరిచాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిలో ఎలుకలు సంచరించడంతో మిగతా రోగులు భయంతో వణికిపోతున్నారు. గతంలో కూడా ఎలుకల బెడదపై రోగులు ఆందోళన చేయడంతో బోన్లతో పట్టారు. మళ్లీ అదే పరిస్థితి మొదటికి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో వరంగల్ జిల్లాలోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకుంది. ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు, చేతులను ఎలుకలు కొరికేశాయి. దీంతో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటన మరువకముందే అలాంటి సంఘటన మరోకటి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.