
ఆఫ్రికా, ఆస్ట్రేలియాకు కాబిల్
మనదేశంలోనూ తవ్వకాలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: విలువైన ఖనిజాల తవ్వకాల కోసం ఖనిజ్విదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) విదేశాల బాట పట్టింది. క్రిటికల్ మినరల్ అసెట్స్ కోసం ఇది ఆఫ్రికాలోని కాంగో, జాంబియా, టాంజానియాతోపాటు ఆస్ట్రేలియాలో వెతుకులాట మొదలుపెట్టిందని కేంద్రం గురువారం ప్రకటించింది. కేంద్ర గనులశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ విషయమై మాట్లాడుతూ ఈ దేశాల్లో రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి అరుదైన లోహాలు ఉన్నాయని భావిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘ఆస్ట్రేలియా ప్రభుత్వం గనుల తవ్వకం కోసం కాబిల్తో కలసి పనిచేస్తోంది. కాంగో, టాంజానియాతోపాటు మరికొన్ని దేశాల్లోనూ క్రిటికల్ మినరల్అసెట్స్ కోసం వెతుకుతున్నాం”అని వివరించారు. మనదేశంలో క్లీన్ ఎనర్జీకి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ఖనిజాల కోసం కేంద్రం చాలా శ్రద్ధ చూపుతోంది. లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాలను విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్‌లు, బ్యాటరీ తయారీల్లో వాడతారు. కాబిల్తో పాటు కోల్ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్(ఓవీఎల్) కలిసి విలువైన ఖనిజాల బ్లాకుల కోసం ఆస్ట్రేలియాలో అన్వేషిస్తున్నాయి.
కోబాల్ట్, కాపర్ వంటి ఖనిజాలను వెలికి తీసేందుకు తొమ్మిది వేల కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఏరియాను మనదేశానికి కేటాయించేందుకు జాంబియా అంగీకరించింది. ఖనిజాన్వేషణకు రెండుమూడేళ్లు పడుతుందని, ఎక్స్‌ప్లోరేషన్ తరువాత మైనింగ్హక్కులు కూడా లభిస్తాయని భావిస్తున్నామని కాంతారావు చెప్పారు. లిథియంకు చాలా డిమాండ్ ఉందని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో లిథియం బ్లాకులు ఉన్నాయని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో మరిన్ని తవ్వకాలు జరపడానికి కేంద్రం ప్రత్యేకంగా జీఎస్ఐ టీమ్‌ను నియమించింది.
మే చివరి నాటికి ఈ విషయంలో స్పష్టత వస్తుందని, ఆ తరువాత వేలం నిర్వహిస్తామని రెడ్డి చెప్పారు. లైసెన్స్ బ్లాకుల్లో తవ్వకాల కోసం వచ్చే నెల వేలం వేస్తామని కూడా వెల్లడించారు. గ్రీన్ఎనర్జీలో స్వయం సమృద్ధిని సాధించడానికి కేంద్రం గత నెల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించింది. ఏడేళ్లలో దీనికోసం రూ.34,300 కోట్లు ఖర్చు చేస్తారు. విలువైన ఖనిజాల కోసం తీర ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఈ మిషన్‌కు రూ.18 వేల కోట్ల వరకు సమకూరుస్తాయి.