హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ టైమింగ్స్ మార్చండి: ఐటీ ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్, బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టింది రైల్వేశాఖ. రెండు ఐటీ హబ్ ల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ రైలును నడుపుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారంలో ఆరు రోజులు నడుస్తోంది. ఈ రైలు టైమింగ్స్ పై ఐటీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది. హైదరాబాద్ లో ఉదయం బయలుదేరి మధ్యాహ్నం తర్వాత వెళుతుందని.. దీని వల్ల రోజంతా టైం వేస్ట్ అవుతుందంటున్నారు. ఐటీ ఉద్యోగుల టార్గెట్ గానే ఈ వందేభారత్ వేశారని.. అలాంటిది ఐటీ ఉద్యోగులకే ఉపయోగపడటం లేదంటున్నారు. అదే బస్సు జర్నీ అయితే రాత్రి 9 గంటలకు బయలుదేరితే.. ఉదయం 7 గంటలకు రీచ్ అవుతామని.. వందే భారత్ అయితే మధ్యాహ్నం చేరుకుంటుందని.. ఈ టైమింగ్స్ లో బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్ లోనూ ట్రాఫిక్ ఉంటుందని.. దీని వల్ల రోజంతా సమయం వృధా అవుతుంది అంటున్నారు ఐటీ ఉద్యోగులు.

ఈ క్రమంలోనే వందే భారత్ టైమింగ్స్ మార్చాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో తెల్లవారుజామున బయలుదేరి బెంగళూరుకు రైలు మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకుంటే బాగుంటుందని టెకీలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో బయలుదేరితే బాగుందని చెబుతున్నారు.  దీని వల్ల అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండదని.. ఆఫీస్ టైమింగ్స్ వేస్ట్ కావనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులకు సూచనలు చేస్తున్నారు హైదరాబాద్, బెంగళూరు ఐటీ ఉద్యోగులు.

హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం దాదాపు 610 కిమీ, వందే భారత్ రైలులో ప్రయాణానికి 8.30 గంటలు పడుతుంది.  IT ఉద్యోగులు , ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొత్తగా ప్రవేశపెట్టిన రైలు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ దాని సమయం గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

రోజూ హైదరాబాద్ నుంచి యశ్వంతాపూర్ మధ్య ప్రయాణించే ప్రయాణికుల తెలిపిన దాని ప్రకారం..  ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్ (ఉదయం 6.49), కర్నూలు సిటీ (ఉదయం 8.24), అనంతపురం (ఉదయం 10.44), ధర్మవరం (ఉదయం 11.14) మీదుగా యశ్వంత్‌పూర్ జంక్షన్‌కు మధ్యాహ్నం 2.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి ప్రజలు వారి ఆఫీసు లేదా ఇంటికి చేరుకునే సమయానికి సాయంత్రం వరకు దాదాపు రెండు గంటలు పట్టవచ్చు. అంటే రోజంతా ప్రయాణానికే సరిపోతుంది. 

తిరుగు ప్రయాణ సమయం కూడా ఇలాగే ఉంటుంది. యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బెంగళూరు ట్రాఫిక్‌ను నివారించడానికి, మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. కూకట్‌పల్లి,మియాపూర్ వంటి ప్రాంతాల్లోని ఇళ్లకు చేరుకోవడానికి అర్ధరాత్రి దాటుతుంది. అయితే ప్రయాణకులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు.