
మత్స్యకారులు నిత్యం వేటకు వెళ్తుంటారు.. అయినా రోజూ విధితో పోరాటం చేస్తారు.. ఒక్కోసారి వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కదు.. కానీ ఒక్క చేప మాత్రం వలకు చిక్కితే.. వారి పంట పడినట్టే.. అలాగే ఓ మత్యకారుడు ఒకే దెబ్బకు లక్షాధికారి అయ్యారు. ఆ రోజు గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది.
కాకినాడ జిల్లాలో ఓ జాలరికి అదృష్టం కలిసొచ్చింది. కచిడి చేప (Golden Fish) అతడి వలకు చిక్కింది.. అది మామూలు చేప కాదు.. కచిడి.. దీన్ని గోల్డెన్ ఫిష్ కూడా అంటారు. అయితే దీని ధర ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే? చేప ఖరీదు ఇంత ఉంటుందా అని నోరుళ్లబెట్టాల్సిందే..?అసలు అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అని చాలా మంది ఈ చేప గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారం. మత్స్యకారులకు కాసులు కురిపిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుంది. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. పులస లేదా కచిడి వంటి చేపలు దొరికితే రైతులకు పండగే.
కాకినాడలోని కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వలకి భారీ కచిడి చేప చిక్కింది. 25 కిలోల బరువున్న ఈ చేపను వేలం వేయగా ఏకంగా రూ.3.30 లక్షలు పలికింది. చేపను వేలం వేసిన వ్యక్తికే రూ.25వేల వరకు కమీషన్ ఇచ్చారు. ఇంత ఖరీదైన చేప వలకు చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవథుల్లేవు. గతంలోనూ ఇలాంటి చేపలు మత్స్యకారులకు చిక్కి వారిని లక్షాధికారులను చేశాయి.
కచిడి చేపలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందుల తయారీలో కచిడి చేప పిత్తాశయం, ఊపిరితిత్తులను వినియోగిస్తారు. ముఖ్యంగా సర్జరీ చేసిన తర్వాత కుట్లువేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తుంటారు. ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడానికి వినియోగిస్తారని చెబుతుంటారు. అందువల్లే ఈ చేపకు ఇంత ఖరీదు అంటున్నారు.