- ఫిబ్రవరి నుంచి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు
- ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి భారీగా మట్టి, బురద
- రెండు టీఎంసీల దాకా పడిపోయిన కెపాసిటీ
- అక్టోబర్ 29 న హైదరాబాద్‌లో కీలక సమావేశం
నిర్మల్, వెలుగు: కడెం ప్రాజెక్ట్‌కు మంచి రోజులు రానున్నాయి. ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదం అంచున నిలిచిన ఈ ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రిపేర్లు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రాజెక్టుల్లో పూడికతీతకు సైతం కడెం రిజర్వాయర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసింది. ఈ మేరకు వచ్చే ఫిబ్రవరి నుంచి సిల్ట్ తొలగింపు పనులకు అధికారులు రెడీ అవుతున్నారు. పూడిక తీస్తే రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం రెండు టీఎంసీలు పెరుగుతుందని అంచనా వేస్తుండగా, ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గేట్లు ఎత్తడంలో గందరగోళం..
కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 5.5 టీఎంసీలకు పడిపోయింది. ముఖ్యంగా ఎగువన ఉన్న చిక్మన్‌వాగు నుంచి ఏటా వర్షాకాలంలో వరదతో పాటు బురద, నల్ల మట్టి, చెత్తాచెదారం వచ్చి చేరుతోంది. సిల్ట్అరెస్ట్ ట్యాంకులు లేకపోవడం, ఎప్పటికప్పుడు పూడిక తొలగించకపోవడంతో సుమారు రెండు టీఎంసీల కెపాసిటీ తగ్గిపోయిందని భావిస్తున్నారు. దీని వల్ల చివరి ఆయకట్టుకు నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరోవైపు వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదను అధికారులు అంచనా వేస్తున్నా, ప్రాజెక్టు కెపాసిటీతో పొంతన కుదరక గందరగోళానికి గురవుతున్నారు. గేట్లెత్తే విషయంలో అంచనాలు తప్పడం వల్ల అకస్మాత్తుగా రిజర్వాయర్ నిండి, ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదంలో పడుతోంది. కాంగ్రెస్అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పలుమార్లు సందర్శించి కడెంలోని సమస్యలపై ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం కడెం పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం గత వేసవిలో రూ.5 కోట్లు రిలీజ్చేయించగా, ఆ నిధులతో కౌంటర్ వెయిట్లు, గేట్ల మరమ్మతులు, ఇతర రిపేర్లన్నింటినీ పూర్తి చేశారు. తాజాగా జరిగిన కేబినెట్‌లో సిల్ట్విషయమూ చర్చకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఈ సమస్య ఉండడంతో అన్నింట్లో పూడికతీత చేపట్టాలని నిర్ణయించారు. కాగా, కడెంలో ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నందున మొదట ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద సిల్ట్తీతకు కేబినెట్ ఆమోదముద్ర వేయడం విశేషం.
ఫారెస్ట్ క్లియరెన్స్‌పై అనుమానాలు...
కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో పూడికతీతకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఆఫీసర్లు సమావేశం కానున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభిస్తారు. నీళ్లు ఎలా తగ్గితే అలా రిజర్వాయర్ నుంచి పూడిక తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక యంత్రాల ద్వారా నల్ల మట్టిని, ఇసుకను వేరు చేసి, మట్టిని వ్యవసాయానికి, ఇసుకను నిర్మాణాలకు తరలించనున్నారు. మరో వైపు కడెం ప్రాజెక్ట్ ప్రాంతమంతా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి పూడిక తొలగించే పనులకు అటవీ, పర్యావరణ శాఖ క్లియరెన్స్‌లు తప్పనిసరికానున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టులో పూడికతీతకు సంబంధించి పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి కాదంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన గైడ్‌లైన్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. పూడికతీత పూర్తయితే ఈ ప్రాజెక్టు ద్వారా 63 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని భావిస్తున్నారు.
హైడ్రాలజీ సర్వేతో పూడిక నిర్ధారణ..
కడెం ప్రాజెక్టులో సిల్ట్ తొలగింపునకు సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం జరగబోతోంది. ప్రాజెక్ట్‌లో మొదట హైడ్రాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సర్వే చేసి పూడిక ఎంత ఉందో తేలుస్తారు. ఆ తర్వాత తొలగింపు పనులు మొదలవుతాయి. తొలగించిన మట్టిని డంప్‌చేసి ప్రాసెసింగ్ చేసేందుకు 10 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని కడెం ప్రాజెక్ట్ ఈఈ విఠల్ తెలిపారు.