
- ఫారెస్ట్ ఆఫీసర్లు భూములు గుంజుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం
- కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఫైర్
కాగజ్ నగర్, వెలుగు : 30 ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు గుంజుకోవాలని చూస్తున్నారని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని శుక్రవారం కడంబ శివారులోని వారు సాగు చేసుకుంటున్న భూముల వద్ద గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారెస్ట్ఆఫీసర్లు తమ గ్రామంలోని ఐదుగురిపై కేసులు పెట్టామని చెబుతున్నారని, రేంజ్ ఆఫీస్కు రావాలంటూ బెదిరిస్తున్నారన్నారు.
తమ తాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ ఆందోళనకారులకు మద్దతు పలికారు. కేసుల విషయమై కాగజ్ నగర్ ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ కడంబ సమీపంలోని 129 కంపార్ట్మెంట్లో ప్లాంటేషన్ను తొలగించి సాగు చేసేందుకు ప్రయత్నించిన కోట మల్లయ్య, కోట భీమయ్య, కోట సత్తయ్య, ఉష్ణబోయిన మల్లయ్య, మల్లెబోయిన జంగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.