కడప కోర్టులో షర్మిల, సునీతలకు షాక్..

ఏపీలో ఒక పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతోంటే, కడప జిల్లాలో ఎన్నికల హడావిడికి తోడు వివేకా హత్య కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కడప ఎంపీగా బరిలో దిగిన షర్మిల వివేకా హత్య కేసు పదే పదే ప్రస్తావిస్తూ జగన్, అవినాష్ రెడ్డిలను ఇరుకున పెడుతోంది. షర్మిలకు తోడు వివేకా కూతురు సునీత కూడా తోడవ్వడంతో ఈ అంశంపై రాజకీయంగా రచ్చ నెలకొంది. ఈ క్రమంలో షర్మిల, సునీతలకు కడప కోర్టు షాక్ ఇచ్చింది.

వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ ల ప్రస్తావన తేవద్దన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఇద్దరికీ చెరో 10వేలు జరిమానా వేసింది కడప కోర్ట్. జరిమానాను జిల్లా లీగల్ సెల్ కు కట్టాలని ఆదేశించింది కడప కోర్ట్. ఈ హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తవించొద్దంటూ వైసీపీ వేసిన పిటిషన్ మేరకు కడప కోర్టు షర్మిల, సునీతలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను ఎత్తేయాలంటూ షర్మిల, సునీతలు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన కోర్ట్ పిటిషన్ ను కొట్టేసి, ఆంక్షలు మీరినందుకు ఇద్దరికీ జరిమానా విధించింది.