డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించిన పవన్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో అప్రమత్తమైన అధికారులు పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి చేసే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కడప జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. 1.91కోట్ల విలువైన 158ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా పోట్లదుర్తి దగ్గర యర్రగుంట్ల - ప్రొద్దుటూరు రోడ్డులో ఆగి ఉన్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.పోలీసులను చూసి పారిపోవాలని ప్రయత్నించిన నిందితులను చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు యర్రగుంట్ల పోలీసులు.ఈ క్రమంలో మొత్తం 1.91కోట్ల విలువ చేసే 158ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక మినీ లారీ, ఒక ట్రాక్టర్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.