ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో బీడీ రోలర్స్ అందరికీ ప్రభుత్వం బీడీ పింఛన్‌ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 7లక్షల మంది, సిరిసిల జిల్లాలో 75వేల మంది మహిళలు బీడీలు చుడుతూ జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం 2014లో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్ ఇస్తోందని, జీఓ 38లో 50 ఏళ్ల లోపు బీడీ కార్మికులందరికీ పింఛన్‌ఇవ్వాలని ఉందన్నారు. పీఎఫ్ తో సంబంధం లేకుండా పెన్షన్ అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ధర్నాలో బీడీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
- వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే ఊరుకోం
- దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యనారాయణ
ధర్మారం, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని ఎంపీ వెంకటేశ్ విమర్శిస్తే ఊరుకోబోమని దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం ధర్మారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేక్‌పై విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్ కుటుంబానికి కాపలా కాయడం తప్ప వెంకటేశ్ ఇప్పటివరకు పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. వివేక్ వెంకటస్వామి రాజకీయాల్లోకి రాకముందే వారి కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయని, ప్రజా సేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేటీఆర్ దగ్గర మెప్పు పొందడం కోసం ప్రజా నాయకుడైన వివేక్ వెంకటస్వామిని విమర్శిస్తే ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తరిమికొడతారని హెచ్చరించారు. సమావేశంలో జంగిలి కిషోర్, లక్ష్మణ్, ప్రశాంత్, స్వామి, దేవి కిషోర్, అనిల్ పాల్గొన్నారు.
- జాగా ఆక్రమించిండు.. న్యాయం చేయండి
- మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కుటుంబీకుల ఆందోళన
కరీంనగర్, వెలుగు: కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇల్లు జాగా మొత్తం ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణంలోని వావిలాలపల్లి ఏరియాకు చెందిన సొన్నాకుల పవన్, రమేశ్, నరేందర్, గోపి, విజయ ఒకే కుటుంబ సభ్యులు. వీరి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇంటి జాగాను పవన్ అనే కుటుంబ సభ్యుడు అక్రమంగా 2020 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. విషయం బయటికి రావడంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరి వాటా వారుగా ఇదే ఏడాది డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో పవన్ మున్సిపల్ అధికారుల సాయంతో ఇంటి నెంబర్ ను మళ్లీ డియాక్టివేట్ చేయించాడు. అధికారులు కూడా సదరు నోటీస్‌ను ఈ కుటుంబ సభ్యులకు అందించలేదు. కాగా మంగళవారం ఆఫీసులో ఆందోళన చేపట్టిన సమయంలో నోటీస్ఇవ్వడం విశేషం. అధికారులు పవన్ తో కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వన్ టౌన్ పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. సమస్య పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
- వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాలి
- కలెక్టర్ కర్ణన్
చొప్పదండి, వెలుగు: వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని, అప్పుడే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కరీంనగర్కలెక్టర్ కర్ణన్ అన్నారు. మంగళవారం చొప్పదండి మండలం రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్సియల్ సైనిక్ బాలుర పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఆయన పరిశీలించారు. స్కూల్ స్థితిగతులు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్ ప్రణాళికలు, భోజన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ రవీందర్, సర్పంచ్లింగయ్య, తహసీల్దార్ రజిత, ఎంపీడీఓ స్వరూప, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
- పొన్నంను విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదు
- కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి
చొప్పదండి, వెలుగు: తెలంగాణ ఏర్పాటు కోసం సొంత పార్టీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే అర్హత బీజేపీ నాయకులకు లేదని కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చొప్పదండిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీజేపీ లీడర్లు వారి స్థాయి మరచి మాట్లాడుతున్నారన్నారు. ఎంపీగా పొన్నం చేసిన అభివృద్ధిపై చర్చ జరపడానికి తాము సిద్ధమని, దమ్ముంటే ఈ నాలుగేళ్లలో బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్‌విసిరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.
మిడ్ మానేర్ లో రొయ్య పిల్లల విడుదల
బోయినిపల్లి, వెలుగు: మండలంలోని మిడ్ మానేర్ ప్రాజెక్టు లో మంగళవారం రొయ్య పిల్లలను వదిలారు. మండలంలోని పాత వరదవెల్లి వద్ద 10 లక్షల 59 వేల రొయ్య పిల్లలను వదిలినట్లు ఎంపీపీ వేణుగోపాల్, సర్పంచ్ లత, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శివప్రసాద్ తెలిపారు.
స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
మిడ్ మానేర్ ప్రాజెక్టు స్థలాలను మంగళవారం ప్రాజెక్టు ఈఈ జగన్, డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టు స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు కందకం తవ్వించారు. ప్రాజెక్టు కోసం రైతులు భూములు ఇవ్వడంతో మిగిలి ఉన్న పొలాలకు వారు వెళ్లేందుకు అధికారులు రోడ్డుకు కొంత స్థలాన్ని కేటాయించారు. కానీ కొందరు వ్యాపారస్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారని, రైతులు ఇటీవల కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. దీంతో అధికారులు స్థలాన్ని పరిశీలించారు.
వర్చువల్‌గా మెడికల్ క్లాస్‌లు ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: పట్టణంలో సింగరేణి నిధులతో నిర్మించిన రామగుండం మెడికల్ కాలేజీ క్లాస్‌లను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కాలేజీకి 150 సీట్లు కేటాయించగా 96 సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు 86 మంది కాలేజీలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంగీత, రామగుండం మేయర్ అనిల్ కుమార్ మాట్లాడారు. రామగుండంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం కృషిచేసిన ఇంజనీరింగ్ అధికారులు, లీడర్లను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ దీపక్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందు, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ క్లాస్ లను మంగళవారం సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్రవి మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, జెడ్పీ చైర్ పర్సన్ వసంత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు