
- కవ్వాల్టైగర్జోన్ లో కాలువలు, కెనాల్స్ రిపేర్లకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ
- 35 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోని కడెం, సరస్వతీ ప్రాజెక్టు కాలువలు
- కవ్వాల్అభయారణ్యంలో కాలువలు, రోడ్లు, వంతెనలకు నిబంధనల అడ్డు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రధాన కాలువ మరమ్మతులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదు. కాలువ భూభాగమంతా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉండటం సమస్యగా మారింది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. 35 ఏళ్ల క్రితం కాలువ నిర్మా ణానికి అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు రిపేర్లకు అడ్డుపడుతోంది. కాలువలో వరదల కారణంగా పెద్ద ఎత్తున మట్టి నిండటం, లైనింగ్ మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, పిచ్చిమొక్కలు మొలవడంతో ఈ కాలువ రూపురేఖలు మారిపోయాయి. జిల్లాలోని సరస్వతీ కెనాల్ ది ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఖానాపూర్ పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ నిబంధనలు అమలవుతున్న కారణంగా ఈ కాలువకు మరమ్మతులు చేయలేకపోతున్నారు. మరమ్మతు పనులు జరగకపోవడంతో కడెం, సరస్వతి కాలువల నుంచి పంటలకు ఈ సారి వానాకాలం సీజన్ లో పూర్తి స్థాయిలో నీరందడం కష్టమేనంటున్నారు.
మారుమూల గ్రామాల రోడ్లదీ అదే పరిస్థితి...
గతేడాది వర్షాల కారణంగా జిల్లాలోని అనేక మారుమూల గిరిజన గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కవ్వాల్ టైగర్ జోన్ నిబంధన వల్ల ఈ రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. పెంబి మండలంలోని రాంనగర్, దొందరి, వట్టపల్లి, గుమ్మేన, యంగ్లాపూర్, పసుపుల తదితర గ్రామాల రోడ్ల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.
కూలిపోయిన పసుపుల బ్రిడ్జి
పెంబి మండలంలోని పసుపుల వంతెన గతేడాది వరదల కారణంగా పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ వంతెన ఇక్కడి ఆరు ఆదివాసీ గ్రామపంచాయతీలకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉండేది. నాణ్యత లోపం కారణంగా కుప్పకూలిపోయింది. ఇప్పటివరకు తిరిగి నిర్మించలేదు. దీంతో వర్షాకాలంలో ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు అటవీశాఖ మాత్రం పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణానికి అనుమతులను మంజూరు చేయలేదు. కడెం నదిపై నిర్మిస్తున్న వంతెన వరదల కారణంగా కొట్టుకుపోయింది. దీనికి కూడా అనుమతులు రాలేవు. దీంతో వర్షాకాలంలో వంతెన పూర్తయో అవకాశం కనిపించడం లేదు
అనుమతుల కోసం అటవీ శాఖకు నివేదించాం...
కడెం ప్రధాన కాలువ మరమ్మతులకు సంబంధించి అటవీశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే అటవీ శాఖకు సర్వే నివేదికలను అందించాం. అనుమతులు రాగానే మరమ్మతు పనులు చేపడతాం. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఈ కాలువ ఉన్నందున అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అనుమతులు లేకుండా పనులు చేపట్టడం సాధ్యం కాదు. జులైలోగా అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తాం.
రవి నాయక్, జేఈ, కడెం ప్రాజెక్టు...