నీతి ఆయోగ్​లో కడెంకు పదో స్థానం

  •     జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

నిర్మల్, వెలుగు: నీతి ఆయోగ్ కార్యక్రమంలో కడెం మండలానికి పదో స్థానం రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కడెం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పమలుపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోషకాహారం, జలవనరులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో దేశ వ్యాప్తంగా అభివృద్ధి పురోగతిపై నీతి ఆయోగ్  సర్వే చేపట్టిందన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో 100 శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అక్షరాస్యత శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఆర్డీఓ విజయ లక్ష్మి, డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎం అండ్​ఎచ్ఓ ధనరాజ్, డీపీఓ శ్రీనివాస్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారి పీవై రమేశ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.