
కడెం ప్రాజెక్టు కల్లోలం రేపుతోంది.. వరద భీకర రూపం దాల్చుతోంది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలఖడ్గం దూసుకొస్తోంది.. లోతట్టు ప్రాంతాలను చీల్చుకుంటూ..ముంచుకుంటూ ముందుకెళ్తోంది.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఉంది. భారీగా పెరుగుతున్న వరద ఉధృతితో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మరో మూడు గేట్లు తెరుచుకోవడం లేదు. జేసీబీ సాయంతో ఒక గేటును ఓపెన్ చేశారు. సామర్ధ్యాన్ని మించి వరద నీరు రావడంతో కండె ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే. గేట్ల పైనుంచి నీరు వెడుతోంది. దీంతో సహాయక చర్యలు మొదలు పెట్టారు. కడెం ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే, 12 గ్రామాలను ఖాళీ చేయించారు. కడెంలో ఐదు గ్రామాలు, దత్తులలో ఏడు గ్రామాలు ఖాళీ చేయించి వారిని పునరవాసా కేంద్రాలకు తరలించారు. అక్కడ వారిని అన్నిరకాల వసతులు, ఆహారం, నీళ్లు, పాలు ఏర్పాటు చేశామని నిర్మల్ కలెక్టర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గినా..కడెంలో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో కొనసాగడంతో కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్, పెద్ద బెల్యాల్ , చిన్న బెల్యాల్ , పాండవ పూర్ గ్రామాలను అలర్ట్ చేశారు.
గతేడాది కూడా ఇదే సీన్ రిపీటైంది.. ఇప్పుడు అంతకంటే పరిస్థితి దారుణంగా ఉంది. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని స్థానికులు వాపోతున్నారు.. గతేడాది గుణపాఠాలను మైండ్‌కు ఎక్కించుకోకుండా మిన్నకుండిపోయారని నిర్మల్ జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. . లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎంత టెన్షన్ పడినా ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం అని.. ఏడాదిగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో కడెం ప్రమాదం లో పడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.