
కడెం/పాల్వంచ రూరల్, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 697.250 అడుగులుగా ఉంది.
అలాగే 7.603 టీఎంసీలకు 6.904 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 7,598 క్యూసెక్కుల వరదనీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. దీంతో ఒక గేటు ఎత్తి 5,896 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కిన్నెరసాని నుంచి 4 వేల క్యూసెక్కులు రిలీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి నీటిని దిగువ ప్రాంతానికి శుక్రవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కిన్నెరసానిలో నీటిమట్టం 405.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు. ఒక గేటును 3 అడుగుల మేరకు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నదని అధికారులు తెలిపారు. దిగుమ ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీచేశామన్నారు.