- వణికించిన కడెం.. దేవుడే కాపాడాలన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- దేవుడే కాపాడాలన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- సురక్షిత ప్రాంతాలకు 12 గ్రామాల ప్రజల తరలింపు
నిర్మల్, వెలుగు: కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడం, దానికి తోడు గేట్లు మొరాయించడంతో స్థానికులు వణికిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి గురువారం ఉదయం నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 3 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ప్రారంభమైంది.
అప్పటికే ప్రాజెక్టు నిండి ఉండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు పంపించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు 18 గేట్లలో కేవలం 14 గేట్లను పైకి ఎత్తగలిగారు. మిగతా నాలుగు గేట్లు మొరాయించాయి. దీంతో 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే బయటకు పంపించగలిగారు. ఒకదశలో గేట్ల మీదుగా వరద పొంగిపొర్లడం, జోరుగా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టు ఇంజినీర్లు, స్టాఫ్, చుట్టుపక్కల జనాలు ఏ క్షణంలో ఏమవుతుందోనని టెన్షన్ పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా అతికష్టం మీద స్థానికుల సాయంతో మరో రెండు గేట్లు ఓపెన్ చేశారు. ఈలోగా పైనుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిజానికి నిరుడు జులైలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ, అదృష్టవశాత్తు బయటపడినప్పటికీ ప్రాజెక్టు రక్షణకు ఏడాది కాలంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల తాజాగా మరోసారి ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. కాగా, అధికారులు 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికీ కడెం మండల కేంద్రంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఎల్లమ్మ తల్లే చూసుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కడెం ప్రాజెక్టుకు మరోసారి ముప్పు ఏర్పడిందన్న సమాచారం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకొని వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ.. ఇక తాము చేసేదేమీ లేదని, అంతా ఎల్లమ్మ తల్లి చూసుకుంటుందని అన్నారు. కాగా, గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి లక్షా 49 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 16 గేట్ల ద్వారా దిగువకు రెండు లక్షల 27 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ALSO READ:తోటి స్టూడెంట్లు ఎగతాళి చేశారని ఆత్మహత్యాయత్నం!
బాధితుల ఆగ్రహం
గతేడాది కడెం ప్రాజెక్టు కొట్టుకపోయే పరిస్థితి వచ్చినా ఏడాదిగా రక్షణ చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ముంపు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్లే తాము ఇండ్లు వదిలి రోడ్ల మీదికి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయించాల్సిన మంత్రి దేవుడి మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు.