ప్రజాపాలన దరఖాస్తుల రూపకల్పనలో లోపాలున్నాయి : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: ప్రజాపాలన దరఖాస్తుల రూపకల్పనలో లోపాలు ఉన్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్​ఘన్​పూర్​లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుల్లో వివరాలు సమగ్రంగా లేవన్నారు. రైతు భరోసా కాలమ్​ కింద రైతు, కౌలు రైతు ఆప్షన్​ ఇచ్చారని, కౌలు కోసం అగ్రిమెంట్​ ఎవరూ చేసుకోరని, కేవలం నోటిమాట ద్వారా వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తారన్నారు. రైతుకు, కౌలు రైతుకు మధ్య అగ్రిమెంట్​ లేనపుడు కాంగ్రెస్​ ప్రభుత్వం కౌలు రైతులకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. 

మేడారం సమ్మక్క జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం లేదని ఆఫీసర్లు ప్రకటించడం బాధకరమన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్​ పాలకులు చెబుతున్న మాటలు సత్యదూరమేనని ఎద్దేవాచేశారు. అంతకుముందు స్టేషన్​ఘన్​పూర్​ మండలంలోని చాగల్లులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చాగల్లులో ఆర్​డీవో వాసం రామ్మూర్తి, డీజీహెచ్​ఎస్​ డా సుగుణాకర్​రాజు, పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్​రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, తహసీల్దార్​ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.