- పదేండ్లు సీఎంగా ఉండి ఆఫీసర్లను బలిచేసిండు
- మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడానికీ ఆయనే కారణం
- రిపేర్లు చేస్తే సరిపోతదని చెప్పడం కేసీఆర్ తెలివితక్కువతనం
- రుణమాఫీ చాలెంజ్ పై హరీశ్ డ్రామాలాడుతున్నాడని ఫైర్
వరంగల్, వెలుగు: పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆఫీసర్లను బలి చేశాడని స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ‘‘ఈ వ్యవహారంలో ఉన్నవారంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఆయన మీద నమ్మకంతోనే వారు ఆ పనిచేసిన్రు. ఇప్పుడు వారందరినీ బలిచేసినట్లే. ఇంకా ఎందుకు దొంగమాటలు” అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి కడియం అన్నారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి శనివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని.. వాటన్నింటికీ ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‍లో పిల్లర్లు కుంగడానికి కూడా కేసీఆరే కారణమని కడియం అన్నారు. ఆయన ప్రభుత్వంలో.. అంత భారీ ప్రాజెక్ట్ లోని పిల్లర్లు కుంగితే.. అవి ప్రాజెక్టులో భాగం కానట్టు, వాటికి రిపేర్ చేయిస్తే సరిపోతదని మాట్లాడడం కేసీఆర్ తెలివితక్కువతనమే అవుతుందన్నారు.
రుణమాఫీ విషయంలో హరీశ్‌రావు మంచి డ్రామా మాస్టర్ లా వ్యవహరిస్తున్నాడని కడియం ఎద్దేవా చేశారు. పంద్రాగస్ట్ వరకు రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ఒప్పుకున్నారని.. కానీ, హరీశ్ దానికిఆరు గ్యారంటీలను కలిపాడని ఆయన విమర్శించారు. రిజైన్లెటర్కూడా స్పీకర్ ఫార్మాట్‍లో రాయలేదని విమర్శించారు. తాటికొండ రాజయ్య, మంద కృష్ణ మాదిగను ఉద్దేశిస్తూ.. తనతోపాటు తన బిడ్డ కులం విషయంలో కొందరు వెదవలు మాట్లాడే తీరుపై తాను సమాధానం చెప్పనని కడియం పేర్కొన్నారు. మీడియా వాళ్లు కూడా తన కులం ప్రస్తావన తేవొద్దన్నారు. తన కులంపై మాట్లాడేవారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా.. అవినీతిపై మాట్లాడేవారు ఈడీ, సీబీఐ ద్వారా విచారణ చేయించి తప్పుంటే చర్యలు తీసుకోవాలని సవాల్‌చేశారు.
బీజేపీకి అవకాశమిస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తరు
కేంద్రంలో బీజేపీకి మరోసారి అవకాశమిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కడియం ఆరోపించారు. ఈ విషయం తాను చెప్పడంలేదని, బీజేపీకి చెందిన ఓ మంత్రే స్వయంగా చెప్పారని అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్న పదేండ్లలో దళితులు, ముస్లింలు, క్రిష్టియన్లపై దాడులు చేశారని.. మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.