- అంబేద్కర్ వారసురాలిగా వస్తున్నా.. ఆశీర్వదించండి
- వరంగల్ లోక్‍సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య
- మామునూర్‍లో విమానం ఎగిరిస్తాం.. మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేస్తం
- ముచ్చట చెప్పట్లే.. సీఎం రేవంత్ రెడ్డి సైతం మాటిచ్చిండు
వరంగల్, వెలుగు: తాను అంబేద్కర్ వారసురాలిగా వస్తున్నానని, తనను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతున్నదని, ఎంపీగా తనను గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తానని తెలిపారు.
గ్రేటర్ వరంగల్ సిటీలో ఏండ్ల తరబడి కలగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాజీపేటకు రెండుసార్లు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసినా.. వివిధ కారణాల వల్ల పనులు కాలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో విభజన చట్టంలోనూ కోచ్ ఫ్యాక్టరీని పొందుపరిచామని చెప్పారు.
ఈ క్రమంలో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‍ఎస్ ప్రభుత్వాలు ఉండటం వల్లే కోచ్ ఫ్యాక్టరీ కల సాకారం కాలేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, కేంద్రంలోనూ తమ పార్టీనే అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తాను గెలిస్తే తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తానన్నారు. మూమునూరులో ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, మహిళల ఆరోగ్యం, యువతకు ఉపాధికి కావాల్సిన ప్రాజెక్టులు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానం గురించి కడియం కావ్య మాటల్లోనే..
సేవ చేయడానికే రాజకీయాల్లోకి..
డాక్టర్‍గా, కడియం ఫౌండేషన్ ద్వారా చేసే సేవ కంటే మరింత ఎక్కువ ప్రజలకు హెల్ప్ చేసే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా. గత పదేండ్లలో పేద బాలికలు, మహిళలు, ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించా. ఇలాంటి సేవలు అందించడానికి ప్రభుత్వం ద్వారా ఎన్నో స్కీంలు ఉంటాయనే విషయం నాన్న కడియం శ్రీహరి మంత్రి అయ్యాక తెలిసింది. అప్పటి వరకు నేను వ్యక్తిగతంగా వేల మందికి సేవ చేస్తే.. రాజకీయాల ద్వారా లక్షలాది మందికి సర్వీస్ అందించాలని భావించా.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇండస్ట్రియల్కారిడర్కు ప్రయారిటీ..
నా చిన్నప్పటి నుంచి సిటీలో కాలనీల్లోకి వరద నీరు వస్తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతోంది. అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తా. దీనిపై సీఎం రేవంత్‍రెడ్డి సైతం హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ చేపడతాం. ఐటీ హబ్, మెగాటెక్స్ టైల్ పార్క్ అభివృద్ధితో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. రెండో రాజధానిగా ఉన్న వరంగల్‌లో నీటి వనరులు, ఖనిజ సంపద, బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, స్మార్ట్ సిటీ, టూరిస్ట్ స్పాట్‍లైన ఖిలా వరంగల్, వెయ్యి స్తంభాల గుడి ఇలా ఎన్నో ఉన్నయ్. నేను ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యేల సహకారంతో వరంగల్‌ను డెవలప్ చేస్తా.
డాక్టర్ కల్పనా దేవి తర్వాత ఆ అవకాశం నాకే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అప్పుడెప్పుడో డాక్టర్ కల్పనా దేవి ఎంపీ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత అలాంటి అవకాశం నాకే వచ్చింది. నాన్న కడియం శ్రీహరి ఇచ్చిన ప్రోత్సాహంతో.. బీఆర్ అంబేద్కర్ వారసులిగా రాజకీయాల్లోకి వస్తున్నా. సెక్యులరిస్ట్‌గా ఉండే నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా.
కలిసి దందా చేసుకునేటోళ్లే.. నాపై పోటీ చేస్తున్రు
లోక్‍సభ ఎన్నికల్లో నాపై పోటీ చేసేటోళ్లు మన్నుతిన్న పాముల్లెక్క పడుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్రు. మనోడు ఎలాగూ గెల్వడని బీఆర్‍ఎస్ వాళ్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేశ్ కోసం పనిచేస్తున్నరు. ఇప్పుడు మిగిలిన ఆరు నియోజకవర్గాలను కలిసి దోచుకుందామన్న ఉద్దేశంతో అరూరికి బీఆర్‍ఎస్ నాయకులు సపోర్ట్ చేస్తున్రు. బీజేపీ నాపై గెల్వలేక వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగుతోంది.
యూత్, మహిళల కోసం.. నాకంటూ ఓ మేనిఫెస్టో
వరంగల్ అభివృద్ధి కోసం ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు తీసుకురావడం అనేది నాతో పాటు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డ్రీమ్. వీటితో సంబంధం లేకుండా నాకంటూ ఓ మేనిఫెస్టో ఉంది. డాక్టర్‍గా, కడియం ఫౌండేషన్ తరఫున ఎందరో పేద బాలికలు, రక్తహీనతతో బాధ పడ్తున్న మహిళలు, ప్రతిభ ఉండి పై చదువులకు వెళ్లలేని విద్యార్థులు, అనాథలకు ఎంతో సేవ చేసిన నేను.. ఇప్పుడు దాని ఫలాలు ఎక్కువ మందికి చేరేలా చూస్తాను. యువ న్యాయం పేరుతో ఉన్న ప్రాజెక్టుతో ఎక్కువ మంది యూత్‍కు ఉపాధి కల్పిస్తా.
కేసీఆర్ కావాలనే ఓరుగల్లును ముక్కలు చేసిండు
హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా ఉన్న ఓరుగల్లును కేసీఆర్ కావాలనే ముక్కలు చేసిండు. ఈ విషయంలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, జనాల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ఆరు జిల్లాలుగా విభజించిండు. సిటీని రెండు ముక్కలు చేసిండు. ఓరుగల్లు అంటే ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే కాకతీయుల గొప్పదనాన్ని కావాలని విచ్ఛిన్నం చేసిండు.
నేను నాన్ లోకల్ అనడం మూర్ఖత్వం
ఏండ్ల తరబడి నేనేంటో తెలిసినవారు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానగానే నాన్ లోకల్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టింది వరంగల్ జిల్లా పర్వతగిరి. నేను పెరిగింది ఇక్కడే. డాక్టర్ కోర్సు చేసేటప్పుడు మాత్రమే కొన్ని రోజులు వరంగల్ వదిలా. ఆ తర్వాత 2014 నుంచి వరంగల్‌లోనే డాక్టర్ వృత్తి నిర్వహిస్తున్నా. పెళ్లయ్యాక భర్త, పిల్లలతో ఇక్కడే ఉంటున్నా. ఇవన్నీ తెలిసి కూడా నాన్ లోకల్ అనడం వారి మూర్ఖత్వం.