బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే. కే.కేశవరావు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు
వరంగల్ ఎంపీగా కడియం ఫ్యామిలీ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. కడియం శ్రీహరికి లేదా ఆయన కూతురు కావ్యకు ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టీకెట్ ఇచ్చినా పోటీ నుంచి తప్పుకున్నారు కావ్య, పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల పోటీచేయలేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే..
పార్టీ మారితే భయమెందుకు?
తాను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఆయన సమావేశమై.. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను సేకరించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతి మరక లేదని, ఒక్క పిట్టీ కేసు కూడా నమోదు కాలేదని కడియం చెప్పారు.
కాంగ్రెస్ నేతలే నా వద్దకు వచ్చి పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఉద్యమకారులకు ఏమీ చేయలేదని, ఒక్క రోజు కూడా దగ్గరికి రానివ్వలేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్బంగా తెలిపారు. తన కోసం పదవులు పణంగా పెట్టి వస్తున్న ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎంపీపీలు అందర్నీ కాపాడుకుంటానని కడియం శ్రీహరి చెప్పారు. పాత కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు.