తనకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చవా?.. దమ్ముంటే నిరూపించాలని అరూరి రమేష్ కు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. అరూరి రమేష్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉన్నాడని.. ఆయన్ను క్లాస్ వన్ కాంట్రాక్టర్ ను చేశానన్నారు. తన ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ తనకు వెన్నుపోటు పొడిచాడని కడయం మండిపడ్డారు.
శుక్రవారం ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు ఇక్కడే పుట్టి పెరిగిందని.. ఇక్కడే ఉద్యోగం చేసిందని.. తన క్లాస్ మెట్ ను ప్రేమ వివాహం చేసుకుందని చెప్పారు. తన కూతురు.. చదువుల్లో ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్ ను ఉపయోగించుకుందన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని 2017లో సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని తెలిపారు. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని.. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో తన కూతురు పెళ్లి చేసుకుందన్నారు. తన పనితీరే.. తన పెట్టుబడి.. అదే తన కూతురిని గెలిపిస్తుందని చెప్పారు.
మంద కృష్ణ మాదిగ కేవలం తన ఒక్కడి వెంట పడడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదని.. మాదగిలకు ద్రోహం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణమాదిగ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటుందని.. రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు రాజ్యాంగంపై అవగాహన లేదని.. పదేళ్ల మోడీ పాలనలో చేసింది ఏమీ లేదు.. కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకుBRS పార్టీ డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే తన కూతురు పోటీ నుండి తప్పుకుంటుందని కడియం అన్నారు.