బీఆర్ఎస్ నల్గొండ సభ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. వారం క్రితమే నల్గొండలో సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి భయపడిన కాంగ్రెస్ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. అసెంబ్లీ ప్రాంగంణంలో మీడియాతో మాట్లాడారు కడియం.
ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి తాము నల్గొండ సభకు వెళ్తున్నామన్నారు కడియం శ్రీహరి . ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, రైతులు వస్తున్నారని చెప్పారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదన్న కడియం.. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. అంతేకాకుండా కరెంట్ కు కూడా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.
ALSO READ :- ఢిల్లీ రోడ్లన్నీ బ్లాక్.. ఆరు నెలల దాకా రైతుల నిరసన ప్లాన్
మరోవైపు మేడిగడ్డ సందర్శనకు శాసనసభ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాలుగు బస్సుల్లో రోడ్డు మార్గంలో బయలుదేరారు. వీరి వెంట ఎంఐఎం సభ్యులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి.