నా తల్లిపై తప్పుడు పోస్టులు పెడ్తున్నరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

నా తల్లిపై తప్పుడు పోస్టులు పెడ్తున్నరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి 
  • ఇది ఎమ్మెల్యే పల్లా పనే: కడియం
  • ఇకపై అలాంటివి పెడితే 
  • వదిలిపెట్టబోనని హెచ్చరిక 

జనగామ, వెలుగు: తన తల్లిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడ్తున్నారని స్టేషన్​ఘన్‌‌‌‌పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డే ఇలాంటి దుర్మార్గమైన పోస్టులు పెట్టిస్తున్నారని, ఇవి మానుకోకపోతే ఇకపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. శనివారం జనగామలో మీడియాతో కడియం మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. 

‘నా కుటుంబ సభ్యులు దేవునూర్ గుట్టల్లో 2 వేల ఎకరాలను ఆక్రమించుకున్నారని, బినామీ పేర్లతో 50 ఎకరాలు పట్టా చేయించుకున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా పల్లా ఇంట్లో గులాంగిరి చేస్తానని, లేదంటే ఆయన నా ఇంట్లో గులాంగిరి చేయాలని నేను సవాల్ చేసినా.. ఇప్పటి వరకు పల్లా నుంచి ఎలాంటి స్పందన లేదు” అని కడియం మండిపడ్డారు. 

ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్.. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని కడియం అన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ‘‘పదేండ్ల కేసీఆర్​పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడి బీఆర్ఎస్‌‌‌‌లో చేరిన విషయం పల్లాకు తెలియదా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పల్లా పదేపదే అంటున్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాను” అని చెప్పారు.