- రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు
- 10 గంటల్లో కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు
- కర్నూల్ జిల్లా ఆలూరులో మైనర్ రెస్క్యూ.. నలుగురు వర్కర్లు అరెస్ట్
శంషాబాద్, వెలుగు: అప్పు పైసలు తిరిగివ్వాలని అడిగినందుకు ఓనర్ కొడుకును కిడ్నాప్ చేసి.. రూ.2 కోట్లు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు మరో ముగ్గురిని కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో జరిగిన ఈ కిడ్నాప్ కేసును పోలీసులు 10 గంటల్లో ఛేదించారు. సోమవారం శంషాబాద్ జోన్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నారాయణ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన కొప్పుల లక్ష్మి పదేండ్ల కిందట రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామానికి వచ్చి చర్చి కాలనీలో ఉంటూ కూరగాయల నర్సరీ నిర్వహిస్తోంది. అనంతపురానికి చెందిన బసవరాజు(29) ఆమె దగ్గర డ్రైవర్ గా, నర్సరీలో పనిచేస్తున్నాడు. అతడిని నమ్మి లక్ష్మి మధ్యవర్తిగా ఉండి రూ.26 లక్షలను అప్పుగా ఇప్పించింది.
బసవరాజు డబ్బులు తిరిగివ్వకపోవడంతో ఆమెకు అప్పుల వాళ్ల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. డబ్బులు తొందరగా తిరిగివ్వాలని బసవరాజుపై ఆమె ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న లక్ష్మి రెండో కొడుకు(16)ను కిడ్నాప్ చేసి ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు బసవరాజు స్కెచ్ వేశాడు. నర్సరీలో పనిచేసే వికారాబాద్ కు చెందిన చిలుకూరు కుమార్(32), గూడెం చిన్నారెడ్డి (24), ముత్తురాగళ్ల భుజంగం(28)తో కలిసి ప్లాన్ వేశాడు. ఈ నెల 19న రాత్రి బసవరాజు.. లక్ష్మి రెండో కొడుకుకి కాల్ చేసి నారు కావాలని అడిగాడు. ఉదయాన్నే తెచ్చిస్తానని బాలుడు చెప్పాడు. 20న తెల్లవారుజామున 5 గంటలకు లక్ష్మి కొడుకు నారుతో నర్సరీ దగ్గరికి వెళ్లాడు. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న బసవరాజు గ్యాంగ్.. లక్ష్మి కొడుకును ఎత్తుకెళ్లి కారులో ఎక్కించారు.
కొంత దూరం ప్రయాణించిన తర్వాత కిడ్నాపర్లు లక్ష్మికి కాల్ చేశారు. ‘మీ కొడుకును కిడ్నాప్ చేశామని.. అతడు తిరిగి సేఫ్ గా ఇంటికి రావాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. కంగారుపడిన ఆమె వెంటనే కడ్తాల్ పీఎస్ లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాపర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బసవరాజు గ్యాంగ్ కర్నూల్జిల్లాలోని ఆలూరులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సాయంతో కడ్తాల్ పోలీసులు సాయంత్రం 6 గంటలకు ఆలూరులో కిడ్నాపర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. మైనర్ ను రెస్క్యూ చేశారు. బాలుడిని లక్ష్మికి అప్పగించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.