వాట్సప్ గ్రూప్ నుంచి రిమూవ్.. కక్షగట్టి మర్డర్

వాట్సప్ గ్రూప్ నుంచి రిమూవ్.. కక్షగట్టి మర్డర్
  •     కడ్తాల్ లో ఇద్దరు యువకుల 
  •     హత్య కేసులో నిందితులు అరెస్ట్ 

శంషాబాద్, వెలుగు:  జంట హత్యల కేసులో ఏడుగురు నిందితులను కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కత్తి, 8 సెల్ ఫోన్లు,  ఇన్నోవా క్రిస్టా కారు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ లో శుక్రవారం డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు హత్య కేసు వివరాలను వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండె మోని శివ(28), మియాపూర్ లోని ఓ చికెన్ సెంటర్ లో లేబర్ పని చేస్తుంటాడు. మీర్ పేట గాయత్రి నగర్ కు చెందిన శేషగిరి శివ(28) కార్ డ్రైవర్. వీరు ఇద్దరు బంధువులు. గోవిందాయ పల్లికి చెందిన జలకం రవితో వీరికి ఫ్రెండ్ షిప్ ఉంది.  ముగ్గురూ భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేసేవారు. ఇటీవల జలగం రవితో మనస్పర్థలు రావడంతో శివ, శేషగిరి శివ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ముగ్గురి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగాయి. ఈనెల 4న రవి కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ లోని తన విల్లాలో బర్త్ డేను ఘనంగా నిర్వహించుకుని.. 300 ఫొటోలను గోవిందాయపల్లి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

 ఆ ఫొటోలను చూసిన శివ, శేషగిరి శివ.. జలగం రవిని, ఫొటోలను గ్రూప్ నుంచి డిలీట్ చేశారు. దీంతో అతడు అవమానంగా తీసుకుని కక్ష పెంచుకుని, వారిని చంపాలని ప్లాన్ చేశాడు. శివ, శేషగిరి శివ  సిటీలో ఉన్నారనే సమాచారం తెలుసుకొని రవి తన ఇన్నోవా క్రిస్టా ( టీఎస్ 07 జేడీ1175) లో ఫ్రెండ్స్ తో కలిసి సిటీకి వెళ్లారు. కారులో శివ, శేషగిరి శివను ఎక్కించుకొని బటర్ ఫ్లై సిటీ లోని తన విల్లాకు తీసుకెళ్లి బంధించారు. అనంతరం విచక్షణారహితంగా కత్తితో ఇద్దరిని పొడిచి చంపి పారిపోయారు. హత్య కేసు నమోదు చేసి నిందితులు రవి అతని ఫ్రెండ్స్..  పలస నాగరాజు గౌడ్, తాళ్లకొండ రాజు, విజయ్, ప్రవీణ్, శేఖర్, జగదీశ్​గౌడ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  జంట హత్యల కేసును 24 గంటల్లో ఛేదించిన సీసీఎస్ పోలీసులు, కడ్తాల్ పోలీసులు, తలకొండపల్లి పోలీసులను డీసీపీ అభినందించారు.