
- పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ ల ధర్నా
కాగజ్‌నగర్, వెలుగు: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన ఏండ్లుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. గురువారం ఆసిఫాబాద్జిల్లా కాగజ్నగర్ఎంపీడీవో ఆఫీస్ కు తాళం వేసి నిరసన తెలిపారు. తమ హయాంలో గత ప్రభుత్వంలో పలు పనులు చేశామని, అప్పట్లో చెల్లించకపోవడంతో పెండింగ్ లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు రూ. లక్షల్లో రావాల్సి ఉండగా అప్పు తెచ్చిన చోట వడ్డీలు కట్టలేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నామని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. చేసేదేం లేక ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేసి ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేకుంటే, ఆత్మహత్యనే దిక్కని మాజీ సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేశారు.