- తేదీ తప్పుగా ఉండటంపై అనుమానాలు
- అది ఎస్ 6 పిల్ల టైగరా..? ఎస్ 8 పులా..?
- వైరల్ గా మారిన ఫొటోలు.. తన దృష్టికి రాలేదన్న ఎఫ్డీవో
కాగజ్ నగర్ : ఇటీవల దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పెద్ద పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో పులి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మూడో పులి ఆచూకీ దొరికిందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగజ్ నగర్, సిర్పూర్ రేంజ్ ల బార్డర్ లోని మానిక్ పటార్ అడవిలో జంతు కళేబరం తింటున్న పులి ఫొటో ఇవాళ తెల్లవారు జామున బయటికి వచ్చింది. ఈ పులి ఏదన్నది మాత్రం అటవీ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. పులి జంతు కళేబరంపై నిలబడి ఉండగా ఇది కెమెరా లో నమోదు అయింది.
అయితే ఈ కెమెరా ట్రాప్ పైన ఉన్న తేదీ అయోమయానికి గురి చేస్తోంది.11/02/2024 గా ఉండడం గమనార్హం. తేదీలు అటు ఇటుగా చూసినా కలవడం లేదు. ప్రస్తుతం జనవరి నెల నడుస్తుండగా.. ఈ ఫొటో ఫిబ్రవరి 11 తేదీని చూపుతోంది. ఒకవేళ రెండో తారీఖు అనుకుంటే అది నవంబర్ నెలది అవుతుంది. కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయని, పులి అడుగులు కూడా గుర్తించామని అన్ని వివరాలు బయటకు చెప్పలేమని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కెమెరాకు చిక్కిన ఈ పులి ఇటీవల విషాహారం తిన్న మూడు పులుల్లో మిస్సింగ్ లో ఉన్న ఎస్ 6 పిల్ల పులిగా చెబుతుండగా, మరో వైపు ఇది గర్భంతో ఉన్న ఎస్ 8 పులి అన్నట్లు కూడా చెబుతున్నారు. దీనిపై కాగజ్ నగర్ ఎఫ్డీఓ వేణు బాబు స్పందిస్తూ ఇప్పటివరకు కెమెరా ట్రాప్ ల విషయం తన దృష్టికి రాలేదని,ఇంకా అడవిలో పులుల కోసం వాటి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.