
కాగజ్ నగర్, వెలుగు: పులుల సంచారం, ఆవాసానికి నిలయంగా ఉన్న కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ ఇక కన్జర్వేషన్ రిజర్వ్ గా మారనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్ నగర్‌ను గతంలో టైగర్ కారిడార్ గా ప్రకటించారు. ఆ తర్వాత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం పులుల సంచారం ఎక్కువైంది. గత నెలలో రెండు పులులు పశువుల కాపర్లు పెట్టిన విష ఆహారం తిని చనిపోయాయి. దీంతో అలెర్ట్ అయిన అటవీ శాఖ అధికారులు కాగజ్ నగర్ ఫారెస్ట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ ను కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించేందుకు ప్లాన్చేస్తున్నారు.
కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ కన్జర్వేటర్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం మంగళవారం కాగజ్ నగర్ డివిజన్ ఆఫీసులో డివిజన్ పరిధిలోని రేంజ్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. టైగర్ మానిటరింగ్, ప్రొటెక్షన్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. మీటింగ్ అనంతరం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. కాగజ్ నగర్ ఫారెస్ట్ లో పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత నెలలో రెండు పులుల మృతి తర్వాత కనిపించకుండాపోయిన మూడు పులుల్లో రెండు పులుల జాడ తెలిసిందని చెప్పారు. మొదట పులి పగ్ మార్క్స్ ను కోర్ ఏరియాలో గుర్తించామని, గొంది అడవిలో అడవి పందిని వేటాడి చంపిందని వెల్లడించారు. పులుల సంరక్షణ పర్యవేక్షణ కోసం ఎన్ టీసీఏ, రాష్ట్ర పీసీసీఎఫ్ సూచన మేరకు వచ్చే నెలలో తెలంగాణ, మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో ఇంటర్ స్టేట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఓకే అయితే కౌంపౌండింగ్ ఉండదు
కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ను కన్జర్వేషన్రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంగా ఏర్పాటు చేస్తే ఇప్పటివరకు ఉన్న రూల్స్ మారానున్నాయి. పెద్ద పులుల రక్షణతో పాటు మిగిలిన వన్య ప్రాణుల రక్షణకు ప్రత్యేక ప్లాన్అమలు చేస్తారు. వన్యప్రాణుల మానిటరింగ్ కీలకం కానుంది. ఇప్పటివరకు అడవిలో పశువుల మేతకు వెళ్లేందుకు కొంత వరకు అనుమతి ఉంది. కన్జర్వేషన్ ఫారెస్ట్ లో అది కుదరదు.
వన్య ప్రాణులను వేటాడి చంపితే ఇప్పటివరకు జరిమానా వేశారు.. ఇక మీదట కచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతారు. అభివృద్ధి పనుల పేరిట, ఉపాధి పేరిట భారీ పరిశ్రమలకి, పర్మిషన్లు రావడం కఠినతరం అవుతుంది. ముఖ్యంగా అటవీ మీద ఆధారపడి జీవనం సాగించే ప్రజలకు ఏకో టూరిజం అవకాశం కల్పిస్తారు. టూరిస్ట్ గైడ్లుగా, జిప్సీ వాహన డ్రైవర్లుగా ఉపాధి దొరుకుతుంది. అటవీ కర్రతో తయారు చేసే వివిధ రకాల వస్తువులతో స్టాళ్లు పెట్టించే అవకాశం ఉంది. అడవి, వన్య ప్రాణుల రక్షణలో భాగంగా స్థానికులకు తాత్కాలిక వాచర్ లుగా ఉపాధి కల్పించే వీలుంది. ఎకో టూరిజం కోసం ప్రత్యేకంగా నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.