
- మున్సిపల్లో వార్డులు కేటాయించకపోవడంతో
- పర్యవేక్షణ కరువు కంపు కొడుతున్న కాలనీలు
కాగజ్ నగర్, వెలుగు: పట్టణాల్లో పాలన మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నియమించిన మున్సిపల్ వార్డు ఆఫీసర్లు విధుల్లో చేరి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వార్డుల మొఖం చూడట్లేదు. కాగజ్ నగర్ మున్సిపల్ లో 30 వార్డులు ఉండగా ఇటీవల జరిగిన నియామకాల్లో 21 మందిని అలాట్ చేశారు. వీరిలో 19 మంది గతేడాది డిసెంబర్ 16న విధుల్లో చేరారు. అయితే పాలక వర్గం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో వార్డు ఆఫీసర్లకు మున్సిపల్ లో వార్డులు కేటాయించలేదు.
దీంతో వాళ్లంతా రెండు నెలలుగా మున్సిపల్ అఫీస్ కే పరిమితమవుతున్నారు. నలుగురు జూనియర్ అసిస్టెంట్లు సైతం అఫీసుకే వెళుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్సుల వసూళ్లు, పట్టణంలోని వార్డుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వార్డు ఆఫీసర్ల పాత్ర కీలకం. ముఖ్యంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇతర సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ వీరికి వార్డులు కేటాయించకపోవడంతో ఫీల్డ్‌కు రావడంలేదు.
దీంతో సిబ్బంది సక్రమంగా పనిచేయడంలేదు. ఫలితంగా కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కాలనీల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు ఎండిపోయాయి. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఇకనైనా స్పెషల్ ఆఫీసర్ దృష్టిపెట్టి వార్డు ఆఫీసర్లను వార్డులకు కేటాయించి తమకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.