T20 World Cup 2024: తృటిలో తప్పిన ప్రమాదం.. బౌండరీ దగ్గర ఢీకొన్న సౌతాఫ్రికా ఆటగాళ్లు

T20 World Cup 2024: తృటిలో తప్పిన ప్రమాదం.. బౌండరీ దగ్గర ఢీకొన్న సౌతాఫ్రికా ఆటగాళ్లు

వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 24) దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. ఇద్దరు సౌతాఫ్రికా ఆటగాళ్లు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మ్యాచ్ లో భాగంగా ఇన్నింగ్స్ 8 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్కరం బౌలింగ్ లో వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ భారీ షాట్ కు  ప్రయత్నించాడు. స్ట్రయిట్ గా కొట్టిన ఈ బంతిని క్యాచ్ అందుకునేందుకు లాంగాన్, లాంగాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న రబడా, జాన్సెన్ వేగంగా వచ్చారు. ఇద్దరు ఒకరికొకరు చూసుకోకుండా బంతిని అందుకోవాలని ప్రయత్నించారు. 

ఈ దశలో ఒకరినొకరు ఢీ కొన్నారు. అయితే రెప్పపాటులో ఇద్దరూ జాగ్రత్త పడడంతో పెద్దగా గాయాలు కాలేదు. జాన్సెన్ బౌండరీ అవతల పడి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. రబడా గ్రౌండ్ లో అలసటగా కనిపించాడు. ఈ మ్యాచ్ లో ఇద్దరూ 17 ఓవర్ వరకు బౌలింగ్ కు రాకపోవడంతో ఈ ఇద్దరి పేసర్లకు గాయాలపాలయ్యారేమో అనుకున్నారు. అయితే 18 ఓవర్లో బౌలింగ్ వేయడానికి రబడా వచ్చాడు. మార్కో జాన్సెన్ బ్యాటింగ్ చేయడానికి రావడంతో వీళ్లిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం అయింది. చివర్లో ఈ ఇద్దరే దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం135 పరుగులు మాత్రమే చేసింది.  విండీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కైల్ మేయర్స్(35), రోస్టన్ చేజ్‌(52)లు మాత్రమే రాణించారు. ఆ తర్వాత వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. 16.1ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 6 పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది. ఈ గ్రూప్ లో సెమీస్ కు చేరిన మరో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది.