Kagiso Rabada: క్రికెట్ అనే పేరు తీసేసి బ్యాటింగ్ అని పెట్టండి: వరల్డ్ క్లాస్ బౌలర్ ఆవేదన

Kagiso Rabada: క్రికెట్ అనే పేరు తీసేసి బ్యాటింగ్ అని పెట్టండి: వరల్డ్ క్లాస్ బౌలర్ ఆవేదన

టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ బ్యాటింగ్.. ఈ ఫార్మాట్ లో బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. 20 ఓవర్ల ఆటలో 10 వికెట్లు ఉండడంతో ఆటగాళ్లు తొలి ఓవర్ నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగుతున్నారు. ముఖ్యంగా ఆటగాళ్లకు వినోదాన్ని డబుల్ చేయడానికి బ్యాటింగ్ పిచ్ లు తయారు చేస్తున్నారు. దీనికి తోడు బ్యాటర్లకు అనుకూలంగా రూల్స్..  మంచు ప్రభావం బౌలర్లకు నరకంగా మారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కూడా బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 

ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ ల్లో 6 జట్లు అలవోకగా 200 పైగా పరుగులు చేశాయంటే బ్యాటర్ల ప్రతాపం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంగళవారం (మార్చి 25) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌలర్లందరూ విఫలమయ్యారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు కాగిసో రబడా, రషీద్ ఖాన్, చాహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ ప్రభావం చూపలేకపోయారు. ఐపీఎల్ లో బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్న తయారు చేస్తున్న పిచ్, రూల్స్ పై సౌతాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా ఆందోళన వ్యక్తం చేశాడు. 

ALSO READ | ఇండియా–ఎజట్టులో సీనియర్లు!

మంగళవారం మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ బంతికి, బ్యాట్ కు మధ్య సమతుల్యత ఉండాలని సూచించాడు. " ఆటగాళ్లకు వినోదాన్ని పంచడానికి ప్రతి మ్యాచ్ లో ఫ్లాట్ వికెట్ తాయారు చేయకూడదు. మనం ఆడే ఆటకు క్రికెట్ బదులు బ్యాటింగ్ అనే పెట్టవచ్చు. నా రికార్డ్స్ కొన్ని బద్దలైనా ఎలాంటి సమస్య లేదు. హై స్కోరింగ్ మ్యాచ్ లు బాగుంటాయి. కానీ లో స్కోరింగ్ మ్యాచ్ లు కూడా మంచి ఆనందాన్ని అందిస్తాయి. బ్యాట్ కు, బంతికి మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి". అని రబడా అన్నాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్ల స్పెల్ వేసిన రబడా 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.