తెలుగువారికి పౌరాణికల్లొ రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో యమధర్మరాజు అంటే కైకాల సత్యనారాయణే గుర్తుకువస్తారు. ఆ పాత్రలో ఆయనని తప్ప మరొకరిని ఊహించలేం కూడా. ఆహార్యం, ఆంగికంతో యముడి పాత్రకి ఆయన జీవం పోశారు. అందుకే కెరీర్లో పదుల సంఖ్యల సినిమాల్లో ఆయన యముడిగా కనిపించారు. ఇందులో యమగోల, యముడికి మొగుడు, యమలీల చిత్రాలు చాలా ప్రత్యేకమైనవని చెప్పాలి.
నిజంగా యముడు అంటే ఇలానే ఉంటాడా..?
1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా యమగోల. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఈ మూవీ విజయంలో యముడిగా కైకాల సత్యనారాయణ నటన అమోఘమనే చెప్పాలి. నిజంగా యముడు అంటే ఇలానే ఉంటాడా..? అనే కొత్త అనుభూతిని తన పాత్ర ద్వారా కైకాల క్రియేట్ చేశారు. ఈ చిత్రం ఆ తరువాత అనేక చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమాలో కైకాల చెప్పే ''యముండ'' డైలాగ్ బాగా ఫేమస్ అయింది.
యముడికి మొగుడు లోనూ ఆదుర్స్
ఇక యమగోల మూవీ ఫార్ములాతో తెరకెక్కిన చిత్రం యముడికి మొగుడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1988లో విడుదలైన చిత్రం అప్పట్లో చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చిత్రగుప్తుడు తప్పిదంతో ఆయువు తీరకుండానే చనిపోయిన చిరు, యమలోకంలో యముడిని ముప్పతిప్పలు పెడతాడు. ఇందులో యముడిగా నటించి కైకాల ఆదరగొట్టారు.
హిమ క్రీములు అంటే అమితంగా ఇష్టపడే యముడిగా
కమెడియన్ ఆలీ హీరోగా, ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం యమలీల. 1994లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనాన్ని సృష్టించింది. భవిష్యవాణి పోగొట్టుకున్న యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వస్తే పరిస్థితి ఏమిటీ...? అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యముడిగా కైకాల నవరసాలు పండించారు. కామెడీ, ఎమోషన్స్, సీరియస్నెస్ కలగలిపి గొప్పగా కైకాల పాత్రను ఎస్వీ కృష్ణారెడ్డి క్రియేట్ చేశారు. యముడి పాత్రలతో వెండితెరపై కైకాల క్రియేట్ చేసిన చరిత్రకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని చెప్పాలి.
కేవలం యముడుగానే కాకుండా అనేక పౌరాణిక చిత్రాలలోకూడా వివిధ పాత్రలు పోషించి ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించి నవరస నటసార్వభౌమగా ప్రేక్షకుల దృష్టిలో చిరస్థాయిగా నిలిచారు.