ఓరుగల్లు పిల్లలతో కైలాస్ సత్యర్థి మాటా ముచ్చట

  • 50వేల మంది స్టూడెంట్లు హాజరు

హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ గ్రౌండ్​లో నిర్వహించిన సభకు చీఫ్ గెస్ట్ గా హాజరై స్టూడెంట్లకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన దాదాపు 50వేల మంది స్టూడెంట్లు హాజరు కాగా, ఆఫీసర్లు వారికి తగిన ఏర్పాట్లు చేశారు. 

పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సమయం, నీరు, ఆహారం వృథా చేయవద్దన్నారు. పిల్లలు సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పాలన్నారు. కార్యక్రమంలో స్టేట్‍ ప్లానింగ్‍ కమిషన్‍ వైస్‍ చైర్మన్‍ బోయినపల్లి వినోద్‍కుమార్‍, చీఫ్ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, మేయర్‍ గుండు సుధారాణి, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు రాజీవ్‍గాంధీ హనుమంతు, డాక్టర్‍ గోపి, సీపీ రంగనాథ్‍, మున్సిపల్‍ కమిషనర్‍ ప్రావీణ్య పాల్గొన్నారు.

కాకతీయుల శిల్ప కళ అద్భుతం..

కాకతీయుల శిల్పకళ అద్భుతమని కైలాస్ సత్యర్థి అన్నారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను, కాకతీయుల చరిత్రను తెలుసుకున్నారు. కాకతీయుల శిల్పకళను దగ్గరుండి పరిశీలించారు.