- ఎవరి ఒత్తిడితోనూ వెళ్లలేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణా శాఖ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ సోమవారం ఉదయం బీజేపీలో చేరారు. గెహ్లాట్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు ఎంఎల్ ఖట్టర్, హర్ష్ మల్హోత్రా, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, జాతీయ మీడియా అధినేత అనిల్‌బలూని తదితరుల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఖట్టర్ మాట్లాడుతూ.. గెహ్లాట్ చేరిక బీజేపీకి టర్నింగ్‌పాయింట్‌గా అభివర్ణించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, అడ్వకేట్‌గా గెహ్లాట్ కుమంచి ప్రజాసేవకుడిగా పేరుందని సచ్‌దేవా అన్నారు.
అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ.. “ఇది నాకు అంత తేలికైన పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కాలం నుంచి నేను ఆప్‌లో భాగమయ్యాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఢిల్లీ ప్రజల కోసం ఎంతో పనిచేశాను. అయితే, నేను బీజేపీ చేరడం రాత్రిపూట నిర్ణయమని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒత్తిడితోనేనని కొందరు అనుకోవచ్చు. కానీ, నేను ఒత్తిడి కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శకులకు చెప్పాలనుకుంటున్నాను" అని ఆయన మీడియాతో అన్నారు.
అయితే, ఆప్ తన విలువలతో రాజీపడిందని, రాజకీయ ఆశయాలు, ప్రజల పట్ల దాని నిబద్ధతను అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. వివిధ అంశాలలో ఆప్ పట్ల విశ్వసనీయత తగ్గిపోవడమే తన రాజీనామా నిర్ణయానికి కారణమని ఆయన అన్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి.. గెహ్లాట్ చేరిక లాభించనుందని, గెలుపు అవకాశాలను పెంచుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.