బాలలపై వేధింపులు పెరుగుతుండటం ఆందోళనకరం : కైలాష్ సత్యార్థి

కొవిడ్ తరువాత బాలలపై వేధింపులకు సంబంధించిన నేరాలు మరింత పెరుగుతున్నాయని, సమాజంలోని ప్రతి ఒక్కరూ లైంగిక దాడులు ఖండించాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. వరంగల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావ్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్ధి పర్యటించారు. వారికి జిల్లా కోర్టులో ఘనస్వాగతం పలికారు. దేశంలో బాలలపై  లైంగిక నేరాలు తగ్గాలని, త్వరగా న్యాయం జరగాలంటే ప్రత్యేక న్యాయ స్థానాలు ఉండాలని కైలాష్ సత్యార్ధి  అన్నారు. ఈ నేరాలను అదుపు చేయడానికి ఫోక్సో కోర్టుల ఏర్పాటు అభినందనీయమని ప్రశంసించారు. బాధితులకు మానసిక ధైర్యం కల్పించాలని సూచించారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ.. బాలల హక్కుల  పరిరక్షణ కోసం  కైలాష్ సత్యార్థి అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, బాలల హక్కుల పరిరక్షణ జరగాలన్నారు. మిగిలిన జిల్లాల్లో ఫోక్సో కోర్టుల ఏర్పాటు జరగాలని సూచించారు. లైంగిక దాడులకు గురైన వారికి అందరూ అండగా ఉండాలని, లైంగిక దాడులకు సంబంధించిన వార్తలు ఇచ్చేటప్పుడు మీడియా ప్రతినిధులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.