అప్పులు ఎగ్గొట్టి..రూ.10కోట్లతో వ్యాపారి జంప్..

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 10 కోట్ల రూపాయలతో ఉడాయించాడు కిరాణ షాప్ ఓనర్ కైరంకొండ గణేష్. కొన్నేళ్లుగా కిరాణ వ్యాపారం చేస్తూ సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరువ్యాపారులు, కూలీల దగ్గర అప్పులు తీసుకుని..నెలనెలా వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు గణేష్. వడ్డీలతో పాటు తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వాలని అడగ్గా మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న తిరుపతికి వెళ్తున్నానని చెప్పి పరారయ్యాడు. తిరిగిరాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు బాధితులు. 
మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి గణేష్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు మంత్రి. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామన్నారు బయ్యారం సొసైటీ ఛైర్మన్ మూల మధుకర్ రెడ్డి.