
స్త్రీశక్తి, మహిళా సాధికారతని చాటే కథ కావడంతోనే ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించానని చెప్పింది కాజల్ అగర్వాల్. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కాజల్ చెప్పిన విశేషాలు..
‘‘భగవంత్ కేసరి’ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో ఉంది. ఇందులో కాత్యాయనిగా సైకాలజిస్ట్ పాత్రలో నటించా. చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ క్యారెక్టర్. అలాగే నా పాత్రలో చాలా హ్యూమర్ కూడా ఉంటుంది. ఇదొక పవర్ ప్యాక్డ్ మూవీ. ఎమోషన్స్, యాక్షన్‌తో పాటు బలమైన సందేశం కూడా ఉంది. బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి. వాటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. శ్రీలీల చేసిన విజ్జి పాత్ర సినిమాకు కీలకం.
ఈ చిత్రం తనకు మంచి పేరుతో పాటు మంచి భవిష్యత్తును కూడా తీసుకొస్తుంది. ఇందులో అనిల్ రావిపూడి గారి స్టైల్ వినోదం ఉంటూనే మెసేజ్ కూడా ఇచ్చారు. తన కెరీర్‌లో ఇది స్పెషల్ మూవీ అవుతుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా తీశారు. ప్రస్తుతం ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు కమల్ హాసన్ గారి ‘ఇండియన్2’లో డిఫరెంట్ రోల్ చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి’’.