- ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- విన్నర్స్‌కు రూ. 3 లక్షలు, రన్నరప్స్‌కు రూ. 2 లక్షల ప్రైజ్ మనీ
- బీసీసీఐ ఏర్పాటు, వరల్డ్ కప్ నిర్వహణలో కాకా చొరవ
- హెచ్‌సీఏ ద్వారా క్రికెట్‌ను పల్లెలకూ తీసుకెళ్లామని వెల్లడి
మంచిర్యాల/కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏటా ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ యువ నాయకుడు వంశీకృష్ణతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టోర్నమెంట్ లో విన్నర్స్ కు రూ.3 లక్షలు, రన్నరప్స్ కు రూ.2 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని వెల్లడించారు. టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను బెల్లంపల్లిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి తన తండ్రి దివంగత కాకా వెంకటస్వామి విశేష కృషి చేశారన్నారు. బీసీసీఐ ఏర్పాటుతో పాటు దేశంలో వరల్డ్ కప్ నిర్వహణకు చొరవ చూపారన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి చిదంబరంతో తన అన్న జి. వినోద్ మాట్లాడి బీసీసీఐ అభివృద్ధికి కృషి చేశారన్నారు. తామిద్దరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షులుగా పనిచేసి క్రికెట్ ను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లామన్నారు. హెచ్ సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని10 జిల్లాల్లో క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించామని చెప్పారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతం నుంచి టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లు బయటకు వచ్చారన్నారు.
ఉప్పల్ స్టేడియం మేమే కట్టించాం..
దేశంలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి తమ కుటుంబం కూడా ఒక కారణమని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి. వినోద్ చెప్పారు. హైదరాబాద్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎవరూ ముందుకురాకపోతే.. విశాక ఇండస్ట్రీస్ ద్వారా ఉప్పల్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని నిర్మించామని తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ 2006 ట్రోఫీని ఇండియాలో నిర్వహించేందుకు కాకా కృషి చేశారన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని వినోద్ వెల్లడించారు. కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికే కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల స్థాయిలో 35, నియోజకవర్గ స్థాయిలో 21 మ్యాచ్ లు జరుగుతాయన్నారు. పెద్దపల్లి లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఇండియా టీమ్ కు ఆడే స్థాయి క్రికెటర్లు బయటకు రావాలని ఆకాంక్షించారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు కేవీ ప్రతాప్, పల్లె రఘునాథ్ రెడ్డి, నర్సింగరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా క్రీడాపోటీలు ప్రారంభం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్, ఆర్యవైశ్య కల్యాణమండపంలో కాకా మెమోరియల్ నేషనల్ లెవల్ కరాటే అండ్ యోగా చాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, కాంగ్రెస్ యువనేత వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఏటా కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ లాంటి జిల్లాల క్రికెటర్లకు దీటుగా మారుమూల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెటర్లు రాణించి కప్ సొంతం చేసుకున్నారని గుర్తుచేశారు. సింగరేణి స్టేడియాల్లో టర్ఫ్ వికెట్ ను అందుబాటులోకి తేవాలని యాజమాన్యానికి సూచించామన్నారు. ఇతర గ్రౌండ్స్ లోనూ ఈ విధానం రావాలన్నారు. ఈ సందర్భంగా వివేక్, వినోద్, వంశీకృష్ణ కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో జాతీయ యోగా కరాటే పోటీల నిర్వహణ చైర్మన్ మునిమంద రమేశ్, కో చైర్మన్ ఎనగందుల వెంకటేశ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ పేరుపెట్టేలా కృషి
సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేలా కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆదివారం క్యాతనపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ యువ నేత వంశీకృష్ణ, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి వివేక్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. న్యూఇయర్ క్యాలెండర్లను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం గురించి తన తండ్రి కాకా వెంకటస్వామి తరచూ చెప్పేవారని గుర్తుచేశారు. 92 ఏండ్ల వయస్సులోనూ ఢిల్లీకి వెళ్లి దీక్ష చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ అని కొనియాడారు. కాకా వెంకటస్వామి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పద్మశాలీల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు.